- ప్రూన్ పండ్లలో చక్కని ఫైబర్
- లాక్సేటివ్ గుణం కలిగిన సార్బిటాల్
- దీంతో సుఖ విరేచనం
- రోజూ 7-8 పండ్లతో మంచి ఫలితం
తిన్న ఆహారం శక్తిగా మారుతుంది. ఆహారం నుంచి శక్తిని గ్రహించిన తర్వాత మిగిలిన వ్యర్థాన్ని జీర్ణాశయం మలం కింద బయటకు పంపుతుంది. ఈ ప్రక్రియ సహజంగా సాగిపోవాలి. అప్పుడు తిన్నది వంట పడుతుంది. మల విసర్జనలో సమస్య ఏర్పడితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక పేగుల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి.
మలబద్ధకం సమస్య ఉన్న వారు దీనికి పరిష్కారంగా ఔషధాలను వినియోగిస్తుంటారు. వీటిని లాక్సేటివ్స్ అంటారు. ఒక్కసారి వీటిని మొదలు పెట్టి కొంతకాలం పాటు వాడితే.. ఆ తర్వాత సహజసిద్ధమైన ప్రక్రియ మందగిస్తుంది. అందుకుని ఔషధాలు కాకుండా సహజ సిద్ధ మార్గాల్లో సుఖ విరేచనానికి, సాఫీ మలవిసర్జనకు మార్గాలను అనుసరించడం మంచిది.
ఇందులో ప్రూన్ పండ్లు సుఖ విరేచనాలకు మంచి పరిష్కారమని న్యూట్రిషనిస్ట్ రాశిచౌదరి తెలిపారు. 15 ఏళ్లపాటు లాక్సేటివ్స్ తీసుకున్న వారు సైతం.. వాటిని ఆపేసి ప్రూన్ పండ్లను తీసుకుంటే, తర్వాత 15 రోజుల్లోనే మంచి ఫలితం కనిపించిందని చెబుతున్నారు.
‘‘ప్రూన్ పండ్లలో ఎంతో ఫైబర్ ఉంటుంది. రోజువారీ మన శరీరానికి కావల్సిన పీచులో 20 శాతం కేవలం 7-8 పండ్లతో భర్తీ చేసుకోవచ్చు. 25-35 గ్రాములు అవసరం పడొచ్చు.
ప్రూన్ పండ్లను (ఎండు, డ్రై) తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత, నీళ్ల విరేచనాలు అనిపిస్తే తీసుకునే పండ్లను తగ్గించుకోవాలి. ఇందులో సార్బిటాల్ ఉంటుంది. దీనికి లాక్సేటివ్ గుణం ఎక్కువ. ఎవరికి వారు తమకు సరిపడినన్ని తీసుకోవాలి. నా వరకు మూడు పండ్లతోనే మంచి ఫలితం ఉంది.
ఒకవేళ నేను మలబద్ధకానికి కారణమయ్యే ఆహారాన్ని తినాల్సి వస్తే ఆ రోజున ప్రూన్ పండ్లను రెండు అదనంగా తింటాను. నీటిలో నానబెట్టి ప్రూన్స్ తినడం వల్ల మలబద్ధకంపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి’’ అని రాశి చౌదరి వివరించారు.