Sri Satya Sai Dist: మరో యవకుడిని బలితీసుకున్న ‘పరువు’.. రాప్తాడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి కిడ్నాప్, హత్య

Honor Killing in Raptadu

  • పెద్దలకు తెలియకుండా గతేడాది వివాహం చేసుకున్న జంట
  • విధులకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా యువకుడి కిడ్నాప్
  • ఆపై లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్య విగత జీవిగా కనిపించిన యువకుడు
  • తన తల్లే చేయించిందంటున్న యువతి

పరువు కోసం పాకులాట మరో యువకుడిని బలితీసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిట్ర మురళి (27) పీజీ పూర్తిచేసి పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. 

అదే గ్రామానికి చెందిన వీణ డిగ్రీ పూర్తి చేసి మూడేళ్ల క్రితం గ్రామ మహిళా పోలీసుగా ఉద్యోగం పొందింది. ప్రస్తుతం ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీణ, మురళి గతేడాది జూన్‌లో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అనంతరం రాప్తాడులో కాపురం పెట్టారు.

ఈ క్రమంలో నిన్న విధుల కోసం వెళ్లేందుకు రాప్తాడు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి మురళిని అపహరించారు. మరోవైపు, విధుల నుంచి ఇంటికి చేరుకున్న వీణ.. భర్తకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానించింది. 

వెంటనే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గాలించింది. అయినప్పటికీ ఆచూకీ లేకపోవడంతో రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే మండలంలోని లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్య మురళి విగత జీవిగా కనిపించాడు. తాము ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేక తల్లే తన భర్తను హత్య చేయించిందని వీణ ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sri Satya Sai Dist
Raptadu
Honor Killing
Crime News
  • Loading...

More Telugu News