Dinesh Kartik: దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్... టీమిండియా స్కోరు 169-6
- టీమిండియా, దక్షిణాఫ్రికా నాలుగో టీ20
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
- 27 బంతుల్లో 55 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్
- 31 బంతుల్లో 46 పరుగులు సాధించిన పాండ్యా
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ కు దిగిన దినేశ్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. కార్తీక్ కు తోడు హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46 రన్స్) కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది.
ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఎప్పట్లాగానే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కిషన్ 26 బంతుల్లో 27 పరుగులు చేసి నోర్జే బౌలింగ్ లో వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (4) నిరాశపరిచాడు.
కెప్టెన్ రిషబ్ పంత్ కూడా తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ 17 పరుగులు చేసి కేశవ్ మహరాజ్ కు వికెట్ అప్పగించాడు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జోడీ సఫారీలపై విరుచుకుపడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్ 1, ప్రిటోరియస్ 1, నోర్జే 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ సాధించారు.