Covid deaths: కరోనాతో ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వేలాది మరణాలు
- అమెరికాలో గతవారం 2,376 మరణాలు
- చైనాలో 1,201 మంది బలి
- అమెరికాలో కొత్త కేసులు 7,43,723
- చైనాలో 5 లక్షలకు పైనే కొత్త కేసులు
అంతర్జాతీయంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతుంటే.. మన దేశంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు గరిష్ఠ స్థాయిలో నమోదవగా.. ఆ తర్వాత నుంచి క్రమంగా మరణాలు తగ్గుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వీక్లీ ఎపిడెమియోలాజికల్ రిపోర్ట్ ను విడుదల చేసింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా కరోనాకు 8,700 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు వారంలో మరణాలతో పోలిస్తే 4 శాతం ఎక్కువ.
అంతర్జాతీయంగా గత వారం వరకు 53.5 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడగా, 63 లక్షల మరణాలు నమోదయ్యాయి. ‘‘ఈ గణాంకాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరీక్షల సంఖ్య తగ్గించడంతో పాజిటివ్ కేసుల సంఖ్య సైతం తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
గతవారం అత్యధికంగా కేసులు వచ్చిన దేశాలను గమనిస్తే.. అమెరికాలో 7,43,723 కొత్త కేసులు, చైనాలో 5,01,146 కేసులు, జర్మనీలో 2,81,706 కేసులు, బ్రెజిల్ లో 2,79,862 కేసులు, ఆస్ట్రేలియాలో 1,94,158 కేసులు వచ్చాయి.
అమెరికా, బ్రెజిల్, కెనడా దేశాల్లో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. అలాగే, కొత్తగా చైనా, ఆస్ట్రేలియా, జపాన్ లోనూ మరణాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో గత వారం 2,376 మంది, చైనాలో 1,201 మంది, ఇటలీలో 443 మంది మరణించారు. బ్రెజిల్ లో 889 మంది, రష్యాలో 500 మంది ప్రాణాలు విడిచారు.