Agnipath Scheme: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు
- రైలు పట్టాలపై వందలాది విద్యార్థులు
- పోలీసులపై రాళ్ల దాడి
- గాల్లోకి కాల్పులు.. కొందరికి గాయాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన వేలాది మంది ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు రైళ్లకు నిప్పుపెట్టి అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది.
తొలుత మొదట మూడు, నాలుగు వందల మంది విద్యార్థులు స్టేషన్ లోకి చొచ్చుకొచ్చారు. ఆ తర్వాత మరింత మంది ఆందోళనకారులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతమంది ఒక్కసారిగా దాడి చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తమ వస్తువులను రైళ్లలోనే వదిలిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు.
ఆందోళనకారులను అదుపు చేసేందుకు రైల్వే పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దాంతో, అదనపు బలగాలను స్టేషన్లో మోహరించారు. పట్టాలపైకి వచ్చిన ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు తర్వాత గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలైనట్టు సమాచారం.
రైల్వే స్టేషన్లో హింస నేపథ్యంలో శుక్రవారం అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.