raod transport: పాక్ కంటే భారత రోడ్లపైనే వేగం తక్కువట: ఐఎంఎఫ్ నివేదిక
- పాకిస్థాన్ లో గంటకు 88 కిలోమీటర్ల సగటు వేగంతో వాహనాలు
- ప్రపంచ జాబితాలో 44వ స్థానం
- భారత్ లోని రోడ్లపై వాహనాల వేగం 58 కిలోమీటర్లే
- అంతర్జాతీయంగా 127వ స్థానం
రహదారులపై వాహనాల వేగం విషయంలో భారత్ ప్రపంచంలోని 162 దేశాలకు గాను 127వ స్థానంలో ఉంది. సగటు వేగం విషయంలో భారత్ కంటే పాకిస్థాన్ మెరుగైన స్థానంలో ఉన్నట్టు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అధ్యయన నివేదిక తెలిపింది. కేవలం ఎంపిక చేసిన నమూనాల ఆధారంగానే ఈ గణాంకాలు వచ్చాయని.. రహదారులపై వాహనాల రద్దీ వాస్తవ పరిస్థితిని ఇవి ప్రతిఫలించక పోవచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.
భారత్ లో ముంబై నుంచి అహ్మదాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-ఢిల్లీ నగరాల మధ్య రవాణాను ఐఎంఎఫ్ పరిగణనలోకి తీసుకుంది. ఇవన్నీ రద్దీ ఎక్కువగా ఉండే రహదారులు కావడం గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా 162 దేశాల పరిధిలోని 760 పట్టణాలను అధ్యయనం కోసం తీసుకున్నారు.
గూగుల్ మ్యాప్స్ ఏపీఐ ఆధారంగా ప్రయాణ సమయాన్ని లెక్కించారు. ఒక పెద్ద పట్టణం నుంచి మరో పెద్ద పట్టణానికి మధ్య కారు ప్రయాణానికి పట్టే సమయాన్ని తీసుకున్నారు. నివేదికలో ఎక్కువ ప్రయాణ వేగం సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలే ఉన్నాయి.
గంటకు 58 కిలోమీటర్ల వేగంతో భారత్ 127వ స్థానంలో ఉంది. అమెరికా 107 కిలోమీటర్ల వేగంతో మొదటి స్థానంలో ఉంటే, 38 కిలోమీటర్ల వేగంతో భూటాన్ దిగువన ఉంది. పాకిస్థాన్ లోని రోడ్లపై సగటు వాహన వేగం 86 కిలోమీటర్లుగా ఉంది. ప్రపంచ జాబితాలో 44వ స్థానంలో ఉంది. కరాచీ నుంచి ఫరీదాబాద్, గుజ్రన్ వాలా నుంచి లాహోర్, రావల్పిండి మార్గాలను అధ్యయనంలోకి తీసుకున్నారు.