Anita Wlodarczyk: దొంగను పట్టుకునే క్రమంలో గాయపడి సీజన్ మొత్తానికి దూరమైన ఒలింపిక్ చాంపియన్
- పోలెండ్ హ్యామర్ త్రో కీడాకారిణి ధైర్యసాహసాలు
- కారులో చొరబడేందుకు దొంగ యత్నం
- పట్టుకుని పోలీసులకు అప్పగించిన వైనం
- దొంగతో పోరాడే క్రమంలో తొడ కండరాలకు గాయం
సాధారణంగా క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే సమయంలోనూ, క్రీడా పోటీల సందర్భంగానో గాయపడుతుంటారు. అయితే ఒలింపిక్ చాంపియన్ అనిటా వ్లోదార్చిక్ ఓ దొంగను పట్టుకునే క్రమంలో గాయపడి సీజన్ మొత్తానికి దూరమైంది. 36 ఏళ్ల అనిటా వ్లోదార్చిక్ పోలెండ్ క్రీడాకారిణి. ఆమె హ్యామర్ త్రో అంశంలో మూడుసార్లు ఒలింపిక్స్ స్వర్ణం గెలుచుకుంది. అంతేకాదు, మహిళల హ్యామర్ త్రో చరిత్రలో 80 మీటర్లకు పైగా విసిరిన తొలి అథ్లెట్ గా రికార్డు పుటల్లోకెక్కింది.
ఇక అసలు విషయానికొస్తే... గతవారం అనిటా వ్లోదార్చిక్ కారులో వెళ్లేందుకు సిద్ధం కాగా, ఓ దొంగ కారులో చొరబడేందుకు యత్నించాడు. ఒక్కతే అయినప్పటికీ అనిటా భయపడకుండా, ఆ దొంగతో పోరాడింది. ఆ దొంగను ఒంటిచేత్తో ఎదిరించి, అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ క్రమంలో అనిటా తొడ గాయానికి గురైంది. గాయం తీవ్రత దృష్ట్యా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
శస్త్రచికిత్స విజయవంతమైందని, ఈ సీజన్ లో ఎలాంటి క్రీడాపోటీల్లో పాల్గొనలేనని అనిటా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. గాయంతో ఈ సీజన్ కు దూరమైనప్పటికీ, తనలోని ఆశావహ దృక్పథం అలాగే ఉందని స్పష్టం చేసింది. ఇక, గాయం నుంచి కోలుకునేందుకు చేయాల్సిన పని చాలా ఉందని పేర్కొంది.
.