Major: పాఠశాలలకు మేజర్ సినిమా ప్రత్యేక ఆఫర్.. టికెట్ ధరపై 50 శాతం రాయితీ

Major Movie Team Offers 50 percent discount to schools
  • మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా వచ్చిన ‘మేజర్’ సినిమా
  • గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ ఇస్తామన్న అడవి శేష్
  • ‘మేజర్’ గురించి రేపటి తరానికి తెలియాలన్నదే తమ లక్ష్యమన్న నటుడు
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మేజర్’ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడీ చిత్రబృందం పాఠశాలకు ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యాలకు టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాల కోసం ప్రత్యేక షో వేస్తామని, అందుకోసం majorscreening@gmail.comకి మెయిల్ చేసి ఈ అవకాశాన్ని పొందొచ్చని మేజర్ చిత్రబృందం తెలిపింది. 

ఇదే విషయానికి సంబంధించి ఆ సినిమా కథానాయకుడు అడవి శేష్ ట్విట్టర్‌లో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. మేజర్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. చాలామంది చిన్నారులు తనకు ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని చెబుతున్నారని అన్నారు. చిన్నారుల నుంచి వస్తున్న స్పందన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వారి కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించినట్టు తెలిపారు. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘మేజర్’ గురించి రేపటి తరానికి తెలియాలనేదే తమ లక్ష్యమని అడవి శేష్ అన్నారు.
Major
Adavi Sesh
Schools
Students
Major Sandeep Unnikrishnan

More Telugu News