Congress: చిరిగిన చొక్కాతో పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత... పోలీసులపై ప్రియాంకా గాంధీ ఫైర్
![priyanka gandhi vadra fires on police over rude with KC Venugopal](https://imgd.ap7am.com/thumbnail/cr-20220613tn62a73899365c1.jpg)
- రాహుల్ ఈడీ విచారణపై కాంగ్రెస్ నిరసనలు
- ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- పెనుగులాటలో వేణుగోపాల్ చొక్కా చిరిగిన వైనం
- పోలీసుల దురుసు ప్రవర్తనపై పోలీస్ స్టేషన్లో వేణుగోపాల్ దీక్ష
- స్టేషన్‌కు వచ్చి, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఆందోళనలకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో ఢిల్లీలో ఈడీ కార్యాలయం ముందు నిరసనకు దిగిన పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా ఆయనను పోలీసులు దాదాపుగా ఈడ్చుకెళ్లినట్లుగా తీసుకెళ్లారు. ఈ పెనుగులాటలో ఆయన చొక్కా చిరిగిపోయింది.
పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించిన తీరుపై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అరెస్ట్ చేసిన నేతలను విడుదల చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించినా... పోలీసుల వైఖరిని నిరసిస్తూ వేణుగోపాల్ పీఎస్‌లోనే దీక్షకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ నేరుగా తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. చొక్కా చిరిగిన స్థితిలో కనిపించిన వేణుగోపాల్‌ను చూసిన ప్రియాంకా గాంధీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ రాజకీయవేత్తలతో వ్యవహరించేది ఇలాగేనా? అంటూ ఆమె పోలీసులపై ఫైరయ్యారు.