Congress: లంచ్ కోసం ఈడీ ఆఫీస్ నుంచి బయటకొచ్చిన రాహుల్ గాంధీ
- ఉదయం 11.30 గంటలకు మొదలైన రాహుల్ విచారణ
- 2.30 గంటలకు ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన రాహుల్
- రాహుల్ లంచ్ కోసం విచారణకు విరామం ఇచ్చామన్న ఈడీ
- లంచ్ తర్వాత తిరిగి ఈడీ విచారణకు వెళ్లనున్న రాహుల్
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్దారన్న ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. గత నెలలో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న రాహుల్ గాంధీ సోమవారం ఆ సంస్థ విచారణకు హాజరయ్యారు.
ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2.30 గంటలకు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. దీంతో ఆయన విచారణ పూర్తి అయినట్టేనని అంతా భావించారు. అయితే విచారణ ఇంకా పూర్తి కాలేదని, మధ్యాహ్నం భోజనం కోసమే రాహుల్ గాంధీని పంపామని ఆ తర్వాత ఈడీ అధికారులు వెల్లడించారు.
సాధారణంగా ఈడీ విచారణకు హాజరయ్యే వారిలో ఏ ఒక్కరినీ కూడా భోజనం కోసం ఇలా విరామం ఇచ్చి బయటకు పంపిన సందర్భాలు లేవనే చెప్పాలి. భోజనం కార్యాలయం లోపలకే తెప్పించి విచారణకు హాజరైన వారికి అధికారులు అందజేస్తుంటారు. అయితే అందుకు విరుద్ధంగా రాహుల్ గాంధీని లంచ్ కోసం బయటకు అనుమతించడం గమనార్హం. భోజనం తర్వాత రాహుల్ గాంధీ తిరిగి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.