THATI MUNJALU: తాటి ముంజల్లో ఏమేమి ఉన్నాయో తెలుసా..?
- పీచు తగినంత ఉండడంతో పేగులకు మంచిది
- సోడియం, పొటాషియంతో డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవచ్చు
- పాలిచ్చే తల్లులకు మేలు
వేసవిలో కనిపించే తాటి ముంజలను చాలా మంది ఇష్టపడతారు. ఇవి తింటే చలువ చేస్తుందని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. నేడు మనం తీసుకునే ఎన్నో పండ్లు క్రిమి సంహారక మందుల రక్షణతో మార్కెట్లలోకి వస్తున్నాయి. కానీ, ఏ మాత్రం రసాయనాల ప్రభావానికి లోను కాకుండా సహజ సిద్ధంగా లభించే తాటికాయల్లోని ముంజలు పోషకాల పరంగా, ఆరోగ్యపరంగా మంచి ఆహారం అనడంలో సందేహం లేదు.
తాటి ముంజల్లో ఫైబర్ ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. మినరల్స్ కూడా ఉంటాయి. చక్కెరలు తక్కువ. విటమిన్ సీ కూడా పుష్కలంగా లభిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు వీటిని తినొచ్చు. రోగనిరోధక వ్యవస్థకు వీటితో మేలు జరుగుతుంది. అలాగే, చర్మం, శిరోజాలకు కావాల్సిన పోషకాలు ముంజల నుంచి లభిస్తాయని అపోలో హాస్పిటల్స్ డాక్టర్ జినాల్ పటేల్ చెబుతున్నారు.
ముంజలను తీసుకోవడం వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోవు. ఎలక్ట్రోలైట్స్ బ్యాలన్స్ కు సాయపడతాయి. ముంజల్లో సోడియం, పొటాషియం ఉంటాయి. కనుక ఎండ ప్రభావాన్ని తట్టుకునేందుకు వీటిని తినొచ్చు. ఇందులో ఉండే పొటాషియం అన్నది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేందుకు, లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణ సమస్యలను సైతం తగ్గిస్తుంది. కాకపోతే ఒకే రోజు, ఒకే విడత ఎక్కువ మొత్తంలో తినకూడదు. రోజుకు 100 గ్రాముల వరకు తినొచ్చు.
ఇక పిల్లలకు పాలిచ్చే తల్లులు ముంజలను తినడం మంచిది. ఇవి తల్లిపాలను వృద్ధి చేస్తాయి. ఇందులో పీచు తగినంత ఉండడం వల్ల పేగుల ఆరోగ్యానికి అనుకూలం. మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు. చర్మంపై దురదలు వస్తుంటే అక్కడ ముంజల్లోని రసాన్ని రాయడం వల్ల ఫలితం ఉంటుంది.
100 గ్రాముల ముంజల్లో 43 కేలరీలు లభిస్తాయి. 11 గ్రాముల కార్బోహైడ్రేట్లు అందుతాయి. విటమిన్ సీ, బీ, ఈ, కే, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం ఉంటాయి.