Hyderabad: ఒక మేజర్ వర్సెస్ ఐదుగురు మైనర్లు!... గ్యాంగ్ రేప్‌లో పరస్పర నిందారోపణలు!
- జూబ్లీ హిల్స్ పీఎస్‌లో గ్యాంగ్ రేప్ నిందితుల విచారణ
- సాదుద్దీన్ ప్రోద్బలంతోనే తప్పు చేశామన్న మైనర్లు
- మైనర్లే ముందుగా బాలికపై అసభ్యంగా ప్రవర్తించారన్న సాదుద్దీన్
- పరస్పర ఆరోపణల నిగ్గు తేల్చే పనిలో పోలీసులు
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో నిందితులు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. జూబ్లీ హిల్స్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మేజర్‌గా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌తో పాటుగా ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు సహా ఐదుగురు మైనర్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో వీరందరినీ కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. సాదుద్దీన్‌ను మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు... మైనర్లలో ముగ్గురిని రెండు రోజుల పాటు మరో ఇద్దరిని శనివారం తొలి రోజు విచారించారు.
విచారణ సందర్భంగా ఐదుగురు మైనర్లు... మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్‌నే దోషిగా చూపే యత్నం చేశారని సమాచారం. తామంతా సైలెంట్‌గానే ఉన్నా సాదుద్దీన్ తమను రెచ్చగొట్టాడని, అతడి ప్రోద్బలంతోనే తాము అఘాయిత్యానికి పాల్పడ్డామని మైనర్లు పోలీసులకు చెప్పారట. సాదుద్దీన్ తమను రెచ్చగొట్టకపోయి ఉంటే అసలు ఈ దారుణానికి తాము పాల్పడే వారమే కాదని కూడా వారు చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఐదుగురు మైనర్లు కట్టగట్టుకుని తనపై ఆరోపణలు చేయడంతో సాదుద్దీన్ వారిపై ప్రత్యారోపణలకు దిగాడట. బాలికపై ముందుగా ఎమ్మెల్యే కుమారుడే అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ తర్వాత తామంతా అతడి బాటలోనే నడిచామని సాదుద్దీన్ చెప్పినట్లు సమాచారం. అంతేకాకాకుండా కాన్జూ బేకరి వద్ద ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయాడని కూడా అతడు చెప్పాడట. ఇలా సాదుద్దీన్ వర్సెస్ మైనర్లుగా సాగిన విచారణలో తేలిన అంశాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.