Bollywood: డ్రగ్స్ కేసుపై ఎట్టకేలకు నోరు విప్పిన షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్
- ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో బాధను వెళ్లగక్కిన ఆర్యన్
- తనపై ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికర్ అనే ముద్ర వేశారని ఆవేదన
- అన్ని వారాలు తాను జైలులో ఉండాలంటారా? అని సూటి ప్రశ్న
కార్డేలియా క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఆ కేసులో ఉండడంతో దేశమంతా ఒక్కసారిగా కంగుతింది. ఆర్యన్ ఖాన్ జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయితే, సరైన ఆధారాల్లేని కారణంగా మే 28న అతడికి ఆ కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది.
అయితే, ఆ కేసుకు సంబంధించి ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు నోరు విప్పాడు. ఇండియా టుడే మేగజీన్ కవర్ స్టోరీ ‘లెసన్స్ ఫ్రమ్ ద ఆర్యన్ ఖాన్ కేస్’కు సంబంధించి చేసిన ఇంటర్వ్యూలో అతడు పలు విషయాలు చెప్పుకొచ్చాడు. ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ తో పాటు ఆర్యన్ ను ఇంటర్వ్యూ చేశారు. అన్ని విషయాలు చెప్తే నిర్దోషిగా బయటకొస్తావంటూ ఆర్యన్ కు చెప్పానని సంజయ్ సింగ్ చెప్పగానే.. మధ్యలో ఆర్యన్ కలగజేసుకుని తన మనసులో నాటుకున్న ఆవేదనను వెళ్లగక్కాడు.
‘‘సర్, మీరు నా మీద ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికర్ అనే ముద్ర వేశారు. డ్రగ్ ట్రాఫికింగ్ కు ఆర్థిక సాయం చేస్తున్నానని అన్నారు. ఈ ఆరోపణలన్నీ మీకు వెగటుగా అనిపించట్లేదా? ఆ రోజు నా దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకకపోయినా నన్ను అరెస్ట్ చేశారు. నేను తప్పు చేశానని అన్నారు. నా పేరు ప్రతిష్ఠలను నాశనం చేశారు. నేను అన్ని వారాలు జైలులో ఎందుకుండాలి? నిజంగా నాకు ఆ శిక్ష పడాలా?’’ అని ఆర్యన్ ఖాన్ అన్నాడు.
కాగా, దర్యాప్తు సందర్భంగా షారూఖ్ కూడా తీవ్ర మనోవేదన అనుభవించారని సంజయ్ సింగ్ చెప్పారు. కేసులో ఉన్న పిల్లలందరి తల్లిదండ్రుల్లాగే షారూఖ్ ఖాన్ కూడా తనను కలవాలనుకున్నారని, దీంతో అతడిని కలిశానని సంజయ్ సింగ్ తెలిపారు. ఆర్యన్ ఖాన్ మానసిక ఆరోగ్యంపై చాలా కలత చెందారన్నారు. జైలులోని ఆర్యన్ ఖాన్ బెడ్ వరకు వెళ్లి రాత్రంతా తోడుగా ఉండేవారని పేర్కొన్నారు. తన కొడుకు వద్ద డ్రగ్స్ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా నేరస్థుడిగా మార్చారంటూ వాపోయారన్నారు. అందరూ తమను రాక్షసుల్లాగా, కరుడుగట్టిన నేరస్థుల్లాగా చూశారంటూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు.