Venkaiah Naidu: ఎస్పీ బాలు జీవితంపై రచించిన 'జీవనగానం' పుస్తకావిష్కరణ.... కమలహాసన్ కు తొలిప్రతిని అందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- పుస్తకం రచించిన డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ
- హైదరాబాదులో పుస్తకావిష్కరణ సభ
- ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య
- కార్యక్రమానికి విచ్చేసిన కమలహాసన్
మహోన్నత గాయకుడు, గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం ఆధారంగా రచించిన 'జీవనగానం' పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ రచించారు. హాసం సంస్థ తరఫున డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ప్రచురించారు.
కాగా, హైదరాబాదులో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమలహాసన్ కూడా హాజరయ్యారు. దీనిపై వెంకయ్యనాయుడు సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్నారు. 'జీవనగానం' పుస్తకాన్ని, సంజయ్ కిశోర్ గీసిన ఆయన జీవన చిత్రాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. బాలు గారికి ఎంతో ఆత్మీయుడైన కమలహాసన్ కు పుస్తకం తొలి ప్రతిని అందజేయడం సంతోషదాయకం అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తన మాతృభాష సంగీతం అని చెప్పడమే కాకుండా, ఆచరణలోనూ చూపించారని, ఈ సందర్భంగా బాలు స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని వెల్లడించారు.
ఈ పుస్తక రచయిత డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ, చిత్ర రూపకర్త సంజయ్ కిశోర్ లకు అభినందనలు తెలుపుతున్నట్టు వివరించారు. ప్రచురణకర్త డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, హాసం సంస్థలకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. బాలు గారి జీవితం గురించి ముందు తరాలకు తెలియజేయాలన్న వారి తపన ఉన్నతమైనదని వెంకయ్యనాయడు కొనియాడారు.
తెలుగు ప్రజల జీవితాల్లోనూ, ఆలయ సుప్రభాతాల నివేదనల్లోనూ బాలు చిరస్మరణీయలు అని కీర్తించారు. వారి గళంలో పలకని భావం గానీ, ఒప్పించని రసం గానీ లేవంటే అతిశయోక్తి కాదని స్పష్టం చేశారు. స్వరాల బాటలోనే కాకుండా, సంస్కారపు బాటలోనూ తాను నడిచి, ముందు తరాలను నడిపించిన బాలు గారు ధన్యజీవి అని ప్రస్తుతించారు.
'పాడుతా తీయగా' కార్యక్రమ నిర్వహణ వెనుక పిల్లలను గాయకులుగానే కాకుండా, ఇతరులు గౌరవించే ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు బాలు గారు పడిన తపన కనిపిస్తోందని వెంకయ్యనాయుడు వివరించారు. వారి స్ఫూర్తితో మన భాష, సంస్కృతి, కళలను కాపాడుకుని భావితరాలకు సగర్వంగా అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎస్పీ బాలు తనయుడు చరణ్, సోదరి ఎస్పీ శైలజ కూడా పాల్గొన్నారు.