Telangana: మోదీ డైరెక్షన్‌లోనే తమిళిసై ప్రజా దర్బార్: జగ్గారెడ్డి
![jaggareddy comments on governors mahila darbar](https://imgd.ap7am.com/thumbnail/cr-20220610tn62a318aa3e428.jpg)
- ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఇప్పటిదాకా చర్యలే లేవన్న జగ్గారెడ్డి
- ఇక మహిళలకు గవర్నర్ ఏం న్యాయం చేస్తారని ప్రశ్న
- నామమాత్రపు దర్బార్‌లతో ఉపయోగం లేదన్న జగ్గారెడ్డి
తెలంగాణ గవర్నర్ హోదాలో ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తానని ప్రకటించిన తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం మహిళా దర్బార్ పేరిట మహిళా సమస్యలపై దృష్టి సారించారు. మహిళా దర్బార్‌లో భాగంగా మహిళా సమస్యలపై మాట్లాడిన ఆమె తెలంగాణ సర్కారుపైనా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తనను ఎవరూ అడ్డుకోలేరంటూ.. తాను ఓ ఉత్ప్రేరకం అని కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళిసై ప్రజా దర్బార్ ముగిసిన వెంటనే దానిపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నర్ ప్రజా దర్బార్‌ను విమర్శించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) గవర్నర్ ప్రజా దర్బార్‌ను విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీల డైరెక్షన్‌లోనే గవర్నర్ ప్రజా దర్బార్ జరిగిందని ఆరోపించారు.
గవర్నర్ జిల్లాలకు వెళితే కలెక్టర్, ఎస్పీలు రాని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించిన కలెక్టర్లు, ఎస్పీలపైనే ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు...ఇక మహిళల సమస్యలను గవర్నర్ ఏం తీరుస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. నామమాత్రపు దర్బార్‌లతో మహిళలకు ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.