AB Venkateswara Rao: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
![ips ab venkateswara rao srites a letter to apcs sameer sharma](https://imgd.ap7am.com/thumbnail/cr-20220609tn62a2001a1b262.jpg)
- తనకు పోస్టింగ్ ఇవ్వాలని సీఎస్‌కు ఏబీవీ అభ్యర్థన
- పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలను విడుదల చేయాలని వినతి
- ఇప్పటికే సీఎస్‌కు 3 లేఖలు రాశానన్న ఏబీవీ
- సీఎస్ స్పందించకపోవడంతో నాలుగో లేఖ రాశానని వెల్లడి
ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. తన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తనకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని సదరు లేఖలో ఆయన సీఎస్‌ను కోరారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న తన జీతభత్యాలను కూడా విడుదల చేయాలని ఏబీవీ కోరారు.
టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ సర్కారు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్లకు పైబడి ఐపీఎస్ అధికారులను సస్పెన్షన్‌లో పెట్టరాదన్న నిబంధనను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏబీవీ ఏపీ ప్రభుత్వంపై విజయం సాధించారు. ఏబీవీ సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేసి, ఆయనను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు తీర్పు కాపీని అందుకున్న తర్వాత పలుమార్లు అమరావతిలోని సచివాలయానికి వెళ్లిన ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్‌ను కలిసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వని సీఎస్ సమీర్ శర్మ తీరుపై ఇదివరకే సంచలన వ్యాఖ్యలు చేసిన ఏబీవీ.. అనంతరం ఆయన ఆదేశాల మేరకు ఇదివరకే జీఏడీలో రిపోర్టింగ్ చేశారు.
ఈ క్రమంలోనే తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏబీవీ తాజాగా సీఎస్‌కు లేఖలు రాయడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే సీఎస్‌కు 3 లేఖలు రాశానని చెప్పిన ఏబీవీ... వాటికి సీఎస్ స్పందించకపోవడంతో తాజాగా గురువారం నాలుగో లేఖ రాశానని వెల్లడించారు.