KL Rahul: రిషబ్ పంత్ కు కేఎల్ రాహుల్ అభినందనలు
- అంతా మంచే జరగాలని ఆకాంక్ష
- గాయం కారణంగా దూరమైన కేఎల్ రాహుల్
- దీంతో మొదటిసారి రిషబ్ పంత్ కు టీమిండియా కెప్టెన్సీ
సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడే జట్టుకు కెప్టెన్ గా చక్కని అవకాశాన్ని సొంతం చేసుకున్న కేఎల్ రాహుల్ ను దురదృష్టం వెన్నాడింది. కాలి తొడల్లో గాయం వల్ల అతడు సిరీస్ మొత్తానికి దూరం కావాల్సివచ్చింది. కానీ, దీన్ని అంగీకరించడం కష్టంగా ఉందన్నాడు రాహుల్.
ఐదు టీ20 మ్యాచుల సిరీస్ కు కెప్టెన్ గా రిషబ్ పంత్, వైస్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిన్న సాయంత్రం ప్రకటించింది. ప్రాక్టీస్ సందర్భంగా కేఎల్ రాహుల్ కు తొడ కండరాలు పట్టేయడంతో అతడు దూరమయ్యాడు. దీంతో రిషబ్ పంత్ కు తొలిసారి టీమిండియాకు కెప్టెన్ గా పనిచేసే గొప్ప అవకాశం లభించింది. తానేంటో నిరూపించుకునే అవకాశం పంత్ తలుపు తట్టింది.
నేటి సాయంత్రం (గురువారం) 7 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ రిషబ్ పంత్, భారత జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ‘‘ఆమోదించడానికి కష్టంగా ఉంది. నాకు మరో సవాలు నేడే మొదలైంది. స్వదేశంలో తొలిసారి జట్టుకు నాయకత్వం వహించడం లేదు. కానీ, జట్టు ఆటగాళ్లకు నా మద్దతు ఉంటుంది. నా పట్ల మీ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. రిషబ్, ఇతర సభ్యులు అందరికీ మంచి జరగాలి. త్వరలోనే కలుసుకుందాం’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు.