Sonia Gandhi: ఇంకా కరోనా నెగెటివ్ రాలేదు... విచారణకు హాజరు కాలేను: సమయం ఇవ్వాలని ఈడీని కోరిన సోనియా గాంధీ
- నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ
- సమన్లు అందుకున్న సోనియా, రాహుల్
- కరోనా బారినపడిన సోనియా
- ఈడీకి లేఖ రాసిన సోనియా కార్యాలయం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొన్నిరోజుల కిందట కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి సోనియా ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే, నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఆమె ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరు కావాల్సి ఉంది. రేపు (జూన్ 8) విచారణకు రావాలంటూ ఇటీవలే ఈడీ సమన్లు పంపింది.
అయితే, తనకు ఇంకా కరోనా నెగెటివ్ రాలేదని, తాను విచారణకు హాజరుకాలేనని సోనియా ఈడీకి స్పష్టం చేశారు. తనకు కొంత సమయం కావాలని, విచారణను మరో తేదీకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోనియా కార్యాలయం ఈడీకి లిఖితపూర్వకంగా తెలియజేసింది.
అటు, సోనియా తనయుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. రాహుల్ ఈ నెల 13న ఈడీ ఎదుట హాజరుకానున్నారు.