Shoaib Akhtar: సచిన్‌ను గాయపరిచి పెవిలియన్‌కు పంపాలని అనుకున్నా: నాటి సీక్రెట్ ను బయటపెట్టిన షోయబ్ అక్తర్
- 2006లో పాకిస్థాన్‌లో పర్యటించిన భారత జట్టు
- ఇంజీ సూచనను పక్కనపెట్టి బౌలింగ్ చేశానన్న అక్తర్
- సచిన్‌ను గాయపరచాలన్న తన వ్యూహం ఫలించలేదన్న స్పీడ్‌స్టర్
టీమిండియా 2006లో పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు సచిన్ టెండూల్కర్‌ను గాయపరచాలని అనుకున్నానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఓ సీక్రెట్‌ను వెల్లడించాడు. సచిన్ టెండూల్కర్‌ను గాయపరచాలనే ఉద్దేశంతో పదేపదే అతడికి తగిలేలా బంతులు వేయాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటి కెప్టెన్ ఇంజమాముల్ హక్ మాత్రం నేరుగా వికెట్లకు బంతిని సంధించాలని పదేపదే చెప్పాడని, కానీ తాను మాత్రం సచిన్ శరీరాన్నే లక్ష్యంగా చేసుకుని బంతులు విసిరానని చెప్పుకొచ్చాడు.
సచిన్‌కు గాయమైతే త్వరగా పెవిలియన్ చేరుతాడని భావించానని అక్తర్ పేర్కొన్నాడు. తన ప్రయత్నం ఫలించినట్టే అనిపించిందని, ఓ బంతి అతడి హెల్మెట్‌కు తాకిందని గుర్తు చేసుకున్నాడు. అయితే, సచిన్ అదేమీ పట్టించుకోలేదని, దులిపేసుకుని బ్యాటింగ్ చేశాడని పేర్కొన్నాడు. ఆ తర్వాత కూడా సచిన్‌ను గాయపరచాలన్న ఉద్దేశంతో పదేపదే బంతులు సంధించినా సఫలం కాలేకపోయానని వివరించాడు. తాను విఫలమైనా అసిఫ్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడని అక్తర్ గుర్తు చేసుకున్నాడు.