Andhra Pradesh: గవర్నర్‌తో జగన్ భేటీ... కోనసీమ అల్లర్లపై వివరణ
- సతీసమేతంగా రాజ్ భవన్‌కు జగన్
- అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై గవర్నర్‌తో చర్చ
- మండలి వ్యవహారాలపైనా చర్చ జరిగినట్టు సమాచారం
- కోనసీమ అల్లర్లపైనే ప్రధాన చర్చ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవలే అల్లర్లు చెలరేగిన కోనసీమ జిల్లాలో తాజా పరిస్థితుల గురించి గవర్నర్‌కు జగన్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అల్లర్లకు దారి తీసిన పరిస్థితులు, జిల్లా పేరు మార్పు దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇళ్లను ఆందోళనకారులు దహనం చేసిన తీరు... తదితర అంశాలపై గవర్నర్‌కు జగన్ పూర్తి వివరాలను అందజేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... త్వరలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, అందులో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పలు కీలక బిల్లులపైనా గవర్నర్‌తో జగన్ చర్చించినట్లుగా సమాచారం. అసెంబ్లీ. శాసన మండలి వ్యవహారాలపైనా గవర్నర్‌తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ కు సీఎం వెంట ఆయన భార్య భారతి కూడా వెళ్లారు.