Vanisha Pathak: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు ఎల్ఐసీ నోటీసులు... జోక్యం చేసుకున్న నిర్మలాసీతారామన్!

LIC issues notice to Vanisha Pathak who lost her parents due to covid

  • భారత్ లో గత రెండేళ్లలో కరోనా విలయం
  • అనాథలుగా మారిన అనేకమంది
  • తల్లిదండ్రులను కోల్పోయిన 17 ఏళ్ల వనిశా
  • ఎల్ఐసీ నుంచి రుణం తీసుకున్న తండ్రి
  • వనిశాపై ఒత్తిడి తీసుకువచ్చిన ఎల్ఐసీ

గత రెండేళ్లలో భారత్ లో విలయతాండవం చేసిన కరోనా మహమ్మారి కారణంగా అనేకమంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథల్లా మారారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరానికి చెందిన వనిశా పాఠక్, ఆమె తమ్ముడు కూడా కరోనా రక్కసి కారణంగా అనాథల్లా మారారు. వనిశా పాఠక్ వయసు 17 సంవత్సరాలు. ఆమె తమ్ముడి వయసు 11 సంవత్సరాలు. 

కాగా, వనిశా తండ్రి జితేంద్ర పాఠక్ ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేస్తూ కరోనాతో మరణించారు. ఆయన ఎల్ఐసీ నుంచి ఇంటి కోసం రూ.29 లక్షల రుణం తీసుకున్నారు. ఆయన అర్థాంతరంగా మరణించడంతో, ఆ లోన్ తీర్చాలంటూ ఎల్ఐసీ వర్గాలు వనిశా పాఠక్ కు నోటీసులు పంపాయి. లోన్ చెల్లించాల్సిందేనని, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎల్ఐసీ నుంచి హెచ్చరికలు వచ్చాయి. 

అయితే, జితేంద్ర పాఠక్ పేరు మీద కమీషన్లు, సేవింగ్స్ పాలసీలు ఉన్నాయి. వనిశాకు మైనారిటీ తీరడంతో అవన్నీ ఆమె చేతికి అందనున్నాయి. ఆ సొమ్ము చేతికి అందాక లోన్ చెల్లిస్తానని వనిశా ఎల్ఐసీకి తెలియజేసింది. కానీ, ఎల్ఐసీ నుంచి స్పందన శూన్యం. 

మరో ఏడాదితో వనిశా మేజర్ అవుతుంది. ఈ నేపథ్యంలో, ఈ మధ్యప్రదేశ్ బాలిక కష్టాలపై మీడియాలో కథనాలు రాగా, అవి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి వెళ్లాయి. ఆమె వనిశా పాఠక్, ఆమె సోదరుడి పరిస్థితి పట్ల చలించిపోయింది. వెంటనే వనిశా పాఠక్ విషయంలో తనకు వివరాలు అందజేయాలని ఎల్ఐసీతో పాటు ఆర్థిక సేవల విభాగానికి నిర్దేశించారు. నిర్మల జోక్యం చేసుకున్న నేపథ్యంలో, ఆ బాలికకు మైనారిటీ తీరేంతవరకు నోటీసులు జారీ చేయరాదని ఎల్ఐసీ కూడా వెనక్కి తగ్గింది. 

వనిశా పాఠక్, ఆమె తమ్ముడ్ని ప్రస్తుతం మేనమామ సంరక్షిస్తున్నారు. వనిశా గతేడాది తల్లిదండ్రులను కోల్పోయిన బాధలోనూ పదో తరగతి పరీక్షలు రాసి 99.8 శాతం మార్కులతో డిస్టింక్షన్ సాధించడం విశేషం.

  • Loading...

More Telugu News