Andhra Pradesh: ఏపీ పదో తరగతి ఫలితాల్లో బాలికల పైచేయి

ap 10th results released

  • 70.70 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు
  • అబ్బాయిల్లో 64.02 శాతమే పాస్
  • మొదటి స్థానంలో ప్రకాశం
  • దిగువ స్థానంలో అనంతపురం
  • జులై 6-15 మధ్య సప్లిమెంటరీ పరీక్షలు

ఎట్టకేలకు పదో తరగతి పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సర్కారు సోమవారం ప్రకటించింది. విజయవాడలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు ముందున్నారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 70.70 శాతంగా ఉంటే.. బాలురలో కేవలం 64.02 శాతమే పాసయ్యారు. 

రాష్ట్రవ్యాప్తంగా 71 పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాలేదని మంత్రి బొత్స వెల్లడించారు. అంటే అక్కడ సున్నా ఫలితాలు వచ్చాయి. 797 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో 78.30 శాతంతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అనంతపురం జిల్లా 49.70 శాతంతో అన్నిటికంటే అడుగున నిలిచింది. వచ్చే నెల 6 నుంచి 15 మధ్య పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

వాస్తవానికి పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 6,22,537 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు జరిగాయి. కరోనా వచ్చిన తర్వాత పదో తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించడం ఇదే మొదటిసారి. కరోనా వల్ల చదువులు సరిగ్గా సాగలేదని.. ఉత్తీర్ణత తగ్గడానికి ఇదే కారణమని మంత్రి చెప్పారు. అందుకని ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.

Andhra Pradesh
10th results
announced
released
Botsa Satyanarayana
  • Loading...

More Telugu News