Kanupur Violence: కాన్పూరు హింసాకాండ: 29 మంది అరెస్ట్.. పోలీసుల అదుపులో ప్రధాన కుట్రదారు
![Kanpur violence 29 arrested documents related to PFI found](https://imgd.ap7am.com/thumbnail/cr-20220605tn629c4fca0eb8a.jpg)
- టీవీ చర్చలో మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత వ్యాఖ్యలు
- మార్కెట్ బంద్‌కు పిలుపునిచ్చిన స్థానిక ముస్లిం నేత
- రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు సహా 39 మందికి గాయాలు
- వీడియో, ఫొటోల ఆధారంగానే అరెస్టులు చేశామన్న కాన్పూరు కమిషనర్
కాన్పూరులోని పరేడ్ చౌక్‌లో శుక్రవారం జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో పోలీసులు 29 మందిని అరెస్ట్ చేశారు. ఈ హింసాత్మక ఘటనలో స్థానిక ముస్లిం నాయకుడు హయత్ జఫర్ హష్మిని ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు గుర్తించారు. ఓ టీవీ న్యూస్ చానల్ చర్చలో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మౌలానా ముహమ్మద్ జవహర్ అలీ ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడైన హయత్ మార్కెట్ బంద్‌కు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రజలను హష్మి రెచ్చగొట్టినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఘర్షణలు రేకెత్తాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు సహా 39 మంది గాయపడ్డారు. హష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రాళ్లు విసిరిన వారితోపాటు ఈ కుట్ర పన్నిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జాఫర్ హయత్ హష్మి ప్రాంగణంలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI)కి సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కాన్పూరు కమిషనర్ తెలిపారు. వీడియో, ఫొటోల ఆధారంగానే ఈ అరెస్టులు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల అలసత్వం ఉన్నట్టు తేలితే అందుకు అనుగుణంగా వారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని వెయ్యిమందికిపైగా నిందితులపై మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్టు కమిషనర్ తెలిపారు.