- ఒక్కసారి వినియోగించే వాటికి ప్రత్యామ్నాయాలు చూడాలి
- జులై 1 నుంచి నిషేధం అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి
- ప్రజలకు అవగాహన కలిగించే చర్యలు తీసుకోవాలన్న కేంద్రం
ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధాన్ని పక్కాగా అమలు చేసేలా చూడాలని అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జులై 1 నుంచి ఈ ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆయా పురపాలికల్లో వీటిపై నిషేధం అమలయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,700 పట్టణ పాలక మండళ్లు ఉండగా, 2,591 సంస్థలు ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని నోటిఫై చేశాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తులను నియంత్రించడం కేంద్రానికి ప్రతిష్ఠాత్మక అంశంగా మారింది.
పెద్ద ఎత్తున స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని, ఇందులో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. పెద్త ఎత్తున చెట్లను నాటించాలని కూడా కేంద్రం కోరింది. ఇందులో ప్రజాభాగస్వామ్యం తీసుకోవాలని సూచించింది. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ కు.. వస్త్రం, జ్యూట్, ప్లాస్టిక్ బ్యాగులు తదితర ప్రత్యామ్నాయాలను పట్టణ పాలకమండళ్లు చూడాలని వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరింది.