Jignesh Mevani: 2017 నాటి కేసులో జిగ్నేష్ మేవానీకి షరతులతో కూడిన బెయిల్
- 2017లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు
- బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ
- అనుమతి లేకుండా గుజరాత్ ను వీడరాదన్న కోర్టు
- పాస్ పోర్టులను కోర్టులో సమర్పించాలని ఆదేశం
గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి 2017 నాటి ఓ కేసులో బెయిల్ లభించింది. అయితే, కోర్టు అనుమతి లేనిదే గుజరాత్ ను వీడరాదని న్యాయస్థానం షరతు విధించింది. మేవానీతో పాటు మరో 10 మందికి కూడా ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మేవానీ సహా వారందరూ తమ పాస్ పోర్టులను కోర్టులో అప్పగించాల్సిందిగా ఆదేశించింది.
2017లో పోలీసుల అనుమతి లేకుండా ఓ ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలతో మేవానీ తదితరులపై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ పిటిషన్లపై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది.
కాగా, కోర్టు తమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం పట్ల జిగ్నేష్ మేవానీ స్పందించారు. కోర్టు నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. అయితే కేంద్రం తనను ఇబ్బంది పెట్టేందుకు ఏ అవకాశాన్నీ వదలడంలేదన్న విషయం మరోసారి స్పష్టమైందని వ్యాఖ్యానించారు.
తాను ఓ నాయకుడ్నని, దేశవ్యాప్తంగా ప్రజలు తనను స్వాగతిస్తున్నారని తెలిపారు. ఇటీవలే కేరళలో ఓ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేశానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తనకు ఆదరణ పెరుగుతుండడం పట్ల బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. అందుకే తనను వేధించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందని అన్నారు.