YSRCP: సీఎం జగన్‌తో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎంపీల భేటీ
- 4 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న వైసీపీ
- ఈసీ నుంచి ప్రకటన రాగానే జగన్‌తో భేటీ అయిన కొత్త ఎంపీలు
- బీసీల హృదయాల్లో జగన్‌ది చెరగని ముద్ర అన్న మస్తాన్ రావు
ఏపీ కోటాలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలు గడువు కంటే ముందే ముగిశాయి. శుక్రవారం నామినేషన్ల గడువు ముగియడంతో 4 స్థానాలకు కేవలం 4 నామినేషన్లే రావడంతో నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు వేణుంబాక విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎస్.నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్లు తీసుకున్న ఎంపీలు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి.. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తమను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల హృదయాల్లో సీఎం జగన్‌ది చెరగని ముద్ర అని బీద మస్తాన్ రావు అన్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తానని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే... రాష్ట్రం నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన నేతలకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందనలు తెలిపారు.