BJP: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాపై సొంత పార్టీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి సెటైర్లు

subramanian swamy satires on home minister amit shah

  • రాష్ట్రప‌తి పాల‌న‌లోని క‌శ్మీర్‌లో నిత్యం ఓ హిందువు హ‌త్య‌కు గురవుతున్నారన్న స్వామి  
  • ఈ కార‌ణంగానే అమిత్ రాజీనామా కోరాల్సి వ‌స్తోందని వ్యాఖ్య  
  • హోం శాఖ‌ను వ‌దిలి క్రీడల శాఖ చేప‌డితే బాగుంటుందని సూచన 

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై విప‌క్షాల విమ‌ర్శ‌లు పెరిగిపోతున్న వేళ‌... సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా సెటైర్లు మొద‌ల‌య్యాయి. క‌శ్మీర్‌లో హిందువుల వ‌రుస హ‌త్య‌లు చోటుచేసుకుంటున్న వైనంపై బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. 

శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ ప‌నిలో విఫ‌ల‌మ‌య్యార‌ని,
రాష్ట్రప‌తి పాల‌న అమ‌ల్లో ఉన్న‌ జమ్మూక‌శ్మీర్‌లో నిత్యం ఓ హిందువు హ‌త్య‌కు గుర‌వుతున్నార‌ని సుబ్రహ్మ‌ణ్య స్వామి గుర్తు చేశారు. ఈ ప‌రిస్థితుల్లోనే అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సి వ‌స్తోంద‌ని ఆయ‌న అన్నారు. అమిత్ షాకు హోం శాఖ‌కు బ‌దులుగా క్రీడ‌ల శాఖ అయితే బాగుంటుంద‌న్న స్వామి.. ఈ రోజుల్లో క్రికెట్‌కు అన‌వ‌స‌ర ఆద‌ర‌ణ బాగా పెరిగింద‌ని వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే ముగిసిన ఐపీఎల్ ఫైన‌ల్‌పైనా ఇదివ‌ర‌కే స్వామి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఫైన‌ల్ మ్యాచ్ విష‌యంలో మ్యాచ్ ఫిక్సింగ్ జ‌రిగింద‌ని నిఘా వ‌ర్గాలు అనుమానిస్తున్నాయ‌ని స్వామి అన్నారు. ఈ కోణంలో వాటిని నిగ్గు తేల్చేందుకు ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం వేయాల‌నుకుంటున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్య‌ద‌ర్శిగా ఉన్నందున కోర్టుల జోక్యం లేకుండా ప్రభుత్వం విచార‌ణ‌కు ఆదేశించ‌లేదు క‌దా? అంటూ స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News