Space Carft: ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్పేస్ క్రాఫ్ట్ తయారీ పరిశ్రమ... బెంగళూరులో స్థాపన
- ఏరోస్పేస్ పార్కులో ఏర్పాటైన స్పేస్ క్రాఫ్ట్ ప్లాంట్
- అనంత్ టెక్నాలజీస్ ఘనత
- ప్రారంభోత్సవానికి హాజరైన ఇస్రో చైర్మన్
కొన్నాళ్లుగా భారత్ లో అంతరిక్ష పరిశోధన రంగం అద్భుతమనదగ్గ రీతిలో దూసుకెళుతోంది. ఈ క్రమంలో మరో మైలురాయి అనదగ్గ ఘట్టం నమోదైంది. దేశంలో ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్పేస్ క్రాఫ్ట్ తయారీ పరిశ్రమ బెంగళూరులో షురూ అయింది. అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ భారత్ లోనే అతిపెద్ద స్పేస్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ను స్థాపించింది. ఈ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హాజరయ్యారు.
ఇక్కడి 15 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలోని నాలుగు వేర్వేరు మాడ్యూల్స్ లో ఏకకాలంలో నాలుగు భారీ స్పేస్ క్రాఫ్టులను నిర్మించే వీలుంది. అంతేకాదు, వాటిని ఇక్కడే సమగ్రంగా పరీక్షించే సౌకర్యం కూడా ఉంది. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్ మెంట్ బోర్డుకు చెందిన ఏరోస్పేస్ పార్కులో ఈ పరిశ్రమ ఏర్పాటైంది.
దీనిపై ఇస్రో ఒక ప్రకటన చేసింది. దేశంలోనే ఇలాంటి స్పేస్ క్రాఫ్టు తయారీ యూనిట్ ఇదే ప్రథమం అని వెల్లడించింది. 1992లో ఏర్పాటైన అనంత్ టెక్నాలజీస్ ఇప్పటివరకు తమతో కలిసి 89 ఉపగ్రహాలు, 69 రాకెట్ల తయారీ, ప్రయోగాల్లో పాలుపంచుకుందని వివరించింది.