KIA: భారత్ లో కియా ఎలక్ట్రిక్ కారు ఈవీ6... వివరాలు ఇవిగో!
- రెండు వేరియంట్లలో ఈవీ6
- సింగిల్ చార్జింగ్ తో 400 కిమీ పైగా ప్రయాణం
- ధర సుమారు రూ.60 లక్షలు!
- సెప్టెంబరులో కారు డెలివరీ
కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ భారత్ లో ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ఎలక్ట్రిక్ క్రాసోవర్ ను తీసుకువచ్చింది. జీటీ లైన్ ఆర్ డబ్ల్యూడీ, జీటీ లైన్ ఏడబ్ల్యూడీ పేరిట ఇది రెండు వేరియంట్లలో వస్తోంది. ఇందులో జీటీ లైన్ ఆర్ డబ్ల్యూడీ ధర రూ.59.95 లక్షలు (ఎక్స్ షోరూం), జీటీ లైన్ ఏడబ్ల్యూడీ ధర రూ.64.95 లక్షలు (ఎక్స్ షోరూం). భారత మార్కెట్లోకి 100 యూనిట్లు విడుదల చేయగా, అన్నీ బుక్కయిపోయాయి.
ఈవీ6కి సంబంధించి కియా పూర్తిగా నిర్మించిన కార్లనే భారత్ మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇప్పటిదాకా 355 ప్రీ బుకింగ్ ఆర్డర్లు నమోదు కావడంతో కియా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే భారత్ కు మరిన్ని ఈవీ6 కార్లు కేటాయిస్తామని కియా చెబుతోంది. కాగా, మే 26 నుంచి భారత్ లో ఈవీ6 బుకింగ్స్ షురూ అయ్యాయి. బుకింగ్ సమయంలో కస్టమర్లు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కియా ఈ ఏడాది సెప్టెంబరులో కార్లను కొనుగోలుదార్లకు అందించనుంది.
ఈవీ6 సాంకేతికత విషయానికొస్తే... ఆర్ డబ్ల్యూడీ మోడల్ లో సింగిల్ మోటార్ సెటప్ అమర్చారు. ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకబిగిన 528 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక, ఏడబ్ల్యూడీ వెర్షన్ లో ఒక్కసారి చార్జింగ్ చేస్తే 425 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. డబుల్ మోటార్ సెటప్ కారణంగా సింగిల్ చార్జింగ్ తో ఇది తక్కువ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. రెండు మోడళ్లలోనూ 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ లను అమర్చారు.