Chadra Sekhar: టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును సీఎం పదవి నుంచి పడగొట్టేందుకు కేసీఆర్ యత్నించారు!: బీజేపీ నేత చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు

KCR tried to pull down Chandrababu from CM chair says BJP leader Chandra Sekhar

  • డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డారన్న చంద్రశేఖర్ 
  • 60 మంది ఎమ్మెల్యేలను కూడగట్టారని వెల్లడి 
  • కేసీఆర్ కుట్రను జ్యోతుల నెహ్రూ పసిగట్టి చంద్రబాబుకు చేరవేశారన్న చంద్రశేఖర్ 
  • అప్రమత్తమైన చంద్రబాబు ఏమీ కాకుండా చూసుకున్నారని వ్యాఖ్య 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబును సీఎం పీఠం నుంచి దించాలని కేసీఆర్ యత్నించారని చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలను కూడగట్టారని తెలిపారు. కేసీఆర్ కుట్రలను జ్యోతుల నెహ్రూ పసిగట్టి చంద్రబాబుకు చేరవేశారని.. వెంటనే చంద్రబాబు అప్రమత్తమయ్యారని అన్నారు. 

కేసీఆర్ కు అధికార దాహం ఎంత ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని చంద్రశేఖర్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలలో చీలిక తీసుకురావాలని కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారని తెలిపారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు మరి కొంత మందితో కలిసి చంద్రబాబును దించేయాలని యత్నించారని చెప్పారు. ఈ క్రమంలో తనను కూడా సంప్రదించారని తెలిపారు. 

చంద్రబాబును సీఎం పదవి నుంచి దించేసి, వెంటనే సీఎం కావాలని ప్రయత్నించారని విమర్శించారు. ఒకానొక సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని... వీళ్లంతా కేసీఆర్ ఇంటికి వెళ్లి, అక్కడ నుంచి చంద్రబాబు ఇంటికి వెళ్లారని.. కానీ, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఆ ఎమ్మెల్యేలందరినీ చిందరవందర చేసేసి, ఏమీ కాకుండా చూసుకున్నారని చెప్పారు. కేసీఆర్ అధికార దాహానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు. 

తెలంగాణ వస్తే మొదటి సీఎం నువ్వే అంటూ దళితుడైన తనతో కేసీఆర్ ఎన్నో సార్లు చెప్పారని చంద్రశేఖర్ అన్నారు. దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదన వద్దని విజయరామారావు చెప్పినా కేసీఆర్ వినలేదని... కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆరే సీఎం పీఠాన్ని అధిరోహించారని విమర్శించారు. 

కేసీఆర్, చంద్రశేఖర్ ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలయ్యారు. ఇద్దరూ కలిసి టీడీపీలో పని చేశారు. అయితే కేసీఆర్ కంటే ముందుగానే చంద్రశేఖర్ మంత్రి అయ్యారు. ఇప్పుడు చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

  • Loading...

More Telugu News