: పెరుగుతో తెలివి పెరుగుతుందట
సహజంగా మనం ఆహారంలో పెరుగు వాడుతుంటాం. ఈ పెరుగు వాడకం వల్ల మన మెదడు పనితీరు కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడిరది. పెరుగు వల్ల మన ఆలోచనా తీరులో మంచి మార్పు వస్తుందని వీరు చెబుతున్నారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పెరుగు తిన్న వారిలో మెదడు పనితీరుపై అధ్యయనం చేశారు. నిజానికి పెరుగులో ఉండే ప్రొబయోటిక్ బ్యాక్టీరియా మనకు మేలు చేస్తుందని, ఈ బ్యాక్టీరియా మన పేగుల్లోని బ్యాక్టీరియాను మారుస్తుందని గతంలోనే శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే తాజాగా జరిపిన అధ్యయనంలో తేలిన విషయం ఏమంటే, ఈ బ్యాక్టీరియానే మన మెదడుపై కూడా ప్రభావం చూపి దాని పనితీరును మారుస్తుందని వారు అంటున్నారు.
పెరుగు తిన్నవారిలో మెదడులో భావోద్వేగాలకు స్పందించే తీరులో, విషయ గ్రహణ, గ్రాహక సంబంధ భాగాల్లో మార్పు కనపడుతున్నట్టుగా వారు గుర్తించారు. పెరుగు తిన్నవారిలో మెదడు మధ్యభాగం, విషయగ్రహణ సంబంధ భాగాల మధ్య బలమైన అనుసంధానాలు ఏర్పడుతున్నట్టు వారు గుర్తించారు. పరిసరాలకు మన మెదడు స్పందించే తీరును పెరుగులోని కొన్ని పదార్ధాలు మార్చే విషయం తమ అధ్యయనంలో తేలిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ కిర్‌స్టన్ టిలిచ్ అంటున్నారు. కాబట్టి పెరుగు తింటూ తెలివి పెంచుకుందామా!