KTR: ప్రత్యర్థి పార్టీతో చేతులు కలపడం వల్లే చంద్రబాబుతో దూరం పెరిగింది.. జగన్ నాకు పెద్దన్న లాంటివారు!: కేటీఆర్

Jagan is like my Elder Brother Says Telangana minister KTR

  • రాజకీయాల్లో ఎవరూ శత్రువులు ఉండరన్న కేటీఆర్  
  • దావోస్ పర్యటనతో రూ. 4,200 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్న మంత్రి
  • తనకు ప్రధాని కావాలన్న ఆశలు లేవని స్పష్టీకరణ
  • వచ్చే ఎన్నికల్లోనూ తమదే అధికారమన్న కేటీఆర్

చంద్రబాబుతో తామెప్పుడూ వివాదాలు పెట్టుకోలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. లండన్, దావోస్‌లలో 12 రోజుల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని, రూ. 4,200 కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు చెప్పారు. మొత్తంగా 25 సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ, మంత్రి అమిత్ షా, కేంద్రంలోని ఇతర మంత్రులు రాష్ట్రానికి పర్యాటకుల్లా వచ్చి వెళ్లిపోతున్నారు తప్పితే రాష్ట్రం ఏర్పడిన ఈ 8 సంవత్సరాల్లో నయాపైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ తొలి నుంచీ మిగులు రాష్ట్రమేనని, వచ్చిన సంపదను అభివృద్ధికే ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. అయితే, పెద్ద నోట్ల రద్దు, కరోనా కారణంగా కొన్ని లక్ష్యాలను సాధించలేకపోయినట్టు అంగీకరించారు.

రాజకీయాల్లో ఎవరూ శత్రువులు ఉండరన్న కేటీఆర్.. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని చెప్పుకొచ్చారు. ఏపీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తనకు పెద్దన్నలాంటి వారని అన్నారు. గతంలో చంద్రబాబునాయుడుతోనూ తామెప్పుడూ వివాదాలు పెట్టుకోలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం తమ ప్రత్యర్థి పార్టీతో చేతులు కలపడం వల్లే ఆయనతో దూరం పెరిగిందని అన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది తామేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. కేటీఆర్ భవిష్యత్ ప్రధాని అన్న వెంచర్ కేపిటలిస్ట్ వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ..  సీఎం దయతో తాను మంత్రిగా ఉన్నానని, తనకు ఇంతకుమించి ఆశలు లేవని  స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News