Sidhu Moosewala: సిద్దూ మూసేవాలాను ఎంత కసిగా చంపారంటే... పోస్టుమార్టం నివేదికే అందుకు సాక్ష్యం!

Postmortem report says 24 bullet wounds on Moosewala body

  • ఈ నెల 29న మూసేవాలా హత్య
  • వాహనంలో వెళుతున్న మూసేవాలాపై కాల్పుల వర్షం
  • రక్తపుమడుగులో కుప్పకూలిన గాయకుడు
  • మూసేవాలా శరీరంపై 24 బుల్లెట్ గాయాలున్నాయని వెల్లడి  

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చిచంపడం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు స్వగ్రామం మూసాలో నిర్వహించారు. వేలాదిగా అభిమానులు తరలివచ్చి మూసేవాలా జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా మూసేవాలా అంత్యక్రియలకు హాజరయ్యారు. సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు తమ బిడ్డ శవపేటికను కన్నీటి నడుమ ముద్దాడడం అందరినీ కలచివేసింది.

కాగా, మూసేవాలా పోస్టుమార్టం నివేదిక అంశాలు జాతీయ మీడియాలో వెల్లడయ్యాయి. అతడి శరీరంపై 24 బుల్లెట్ గాయాలు ఉన్నాయంటే ఎంత కసిగా చంపారో అర్థమవుతుంది. మూసేవాలా పుర్రెలోనూ ఓ బుల్లెట్ ను గుర్తించారు. హత్యకు గురైన రోజున మూసేవాలా తన వాహనంలో ఇద్దరు సన్నిహితులతో కలిసి వెళుతున్నారు. మూసేవాలా వాహనాన్ని అటకాయించిన దుండగులు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. 

ఆ వాహనంలో మరో ఇద్దరు ఉన్నప్పటికీ, దుండగులు కేవలం మూసేవాలాను గురిచూసి కాల్పులు జరిపారు. పదుల సంఖ్యలో బుల్లెట్లు ఆ గాయకుడి శరీరాన్ని ఛిద్రం చేశాయి. శక్తిమంతమైన అస్సాల్ట్ తుపాకులతో అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్లు మూసేవాలా దేహం నుంచి అవతలి వైపుకు దూసుకెళ్లాయి. ఈ మేరకు పోస్టుమార్టం చేసిన వైద్యులు 24 బుల్లెట్ల తాలూకు 'ఎంట్రీ అండ్ ఎగ్జిట్' ఆనవాళ్లను గుర్తించారు. లోపలి అవయవాలన్నీ బుల్లెట్ గాయాలతో దెబ్బతిన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. 

కాగా, మూసేవాలా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Sidhu Moosewala
Murder
Postmortem
Bullets
Punjab
  • Loading...

More Telugu News