TDP Mahanadu: మంచినీళ్ల బాటిళ్లు మోస్తున్న ఈ తెలుగు తమ్ముడు ఎవరో తెలుసా?.. వైరల్ అవుతున్న ఫొటో!
![TDP State Secretary Bandaru Appala Naidus photo in mahanadu goes viral on social media](https://imgd.ap7am.com/thumbnail/cr-20220531tn6295df5e4a54b.jpg)
- మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు అప్పలనాయుడు
- పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న వైనం
- మహానాడులో మంచి నీళ్ల బాటిళ్ల కార్టన్‌ను మోసుకెళ్లిన వైనం
తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వార్షిక వేడుక మహానాడు శని, ఆదివారాల్లో ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో జరిగిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత జరిగిన మహానాడు కావడంతో ఈ వేడుకకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. పార్టీ అంచనా వేసిన దాని కంటే రెట్టింపు సంఖ్యలో జనం తరలివచ్చారు. ఫలితంగా సభకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటానికి పార్టీ యువ నేతలు శక్తివంచన లేకుండా కృషి చేశారు.
ఈ సందర్భంగా తమ పదవులు, కుటుంబ రాజకీయ నేపథ్యాలను పక్కనపెట్టేసి మరీ రంగంలోకి దిగిపోయారు. ఎవరికి తోచిన పనిని వారు.. ఏది అవసరమైతే దానిని చేసుకుంటూ పోయారు. మొత్తంగా మహానాడు గ్రాండ్ సక్సెస్‌గా ముగియడంలో పార్టీ యువ నేతలు కీలక భూమిక పోషించారు.
ఇలా పార్టీ సేవలో మునిగిపోయిన ఓ యువ నేతకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పసుపు చొక్కా ధరించి ఏమాత్రం భేషజాలు లేకుండా మంచి నీళ్ల బాటిల్ కార్టన్‌ను మోసుకువెళుతున్న ఓ యువ నేత అందులో కనిపించారు. అసలు తనను ఫొటో తీస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా పనిలో లీనమైపోయిన ఆ నేత మరెవరో కాదు. విశాఖకు చెందిన పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు ఆయన!
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్న అప్పలనాయుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానూ విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉండి కూడా మంచి నీళ్ల బాటిళ్ల కార్టన్‌ను మోసుకెళ్లిన అప్పలనాయుడు ఫొటోను టీడీపీ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.