Divyavani: టీడీపీకి సినీనటి దివ్యవాణి రాజీనామా!
- పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశానన్న దివ్యవాణి
- మహానాడులో అవమానం జరిగిందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వైనం
- దివ్యవాణికి ఫోన్ చేసిన కేఏ పాల్
తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న సినీనటి దివ్యవాణి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె వెల్లడించారు. తన రాజీనామాకు గల కారణాలను కూడా ఆమె వివరించారు. తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. ఈ సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
రెండురోజుల క్రితమే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పార్టీపై ఆరోపణలు చేశారు. మహానాడులో తనకు అవమానం జరిగిందని ఆమె చెప్పారు. టీడీపీకి తాను నిస్వార్థంగా పని చేస్తున్నానని... అయినా పార్టీలో తనకు గుర్తింపే లేదని అన్నారు. ఒక కళాకారుడు పెట్టిన పార్టీలో తనలాంటి కళాకారులకు సరైన స్థానం లేకపోవడం బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో తాను ఇన్ని రోజులు ఎలాంటి అధికారం లేని అధికార ప్రతినిధిగా ఉన్నానని చెప్పారు. సీఎం జగన్ పై కానీ, మాజీ మంత్రి కొడాలి నానితో కానీ తనకు వ్యక్తిగతం ఎలాంటి విభేదాలు లేవని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె వైసీపీలో చేరే అవకాశం ఉండొచ్చని కొందరు అంటున్నారు. మరోవైపు తమ పార్టీలో చేరాలంటూ కేఏ పాల్ కూడా ఆమెకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.