Narendra Modi: కొవిడ్ అనాథ పిల్లలకు నెలకు రూ. 4 వేలు.. వారికి 23 ఏళ్లు నిండాక రూ. 10 లక్షలు: మోదీ

PM Modi unveils Rs 10 lakh support for Covid orphaned children under PM Cares scheme

  • ‘పిల్లల కోసం పీఎం కేర్స్’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని
  • కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన వారికి చేయూత
  • విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో స్కాలర్‌షిప్‌లు జమ చేసిన మోదీ
  • పీఎం కేర్స్ నిధులతో ఎన్నో ప్రాణాలు నిలబెట్టగలిగామన్న ప్రధాని

కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన చిన్నారులకు నెలకు రూ. 4 వేల చొప్పున అందించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. అలాగే, వారికి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత రూ. 10 లక్షల ఆర్థిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిన్న ‘పిల్లల కోసం పీఎం కేర్స్’ పథకాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి రోడ్డున పడిన చిన్నారులను ఉద్దేశించి ఈ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు వారి ఖాతాల్లో స్కాలర్‌షిప్ మొత్తాన్ని జమ చేశారు. విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రొఫెషనల్ కోర్సులు చేసేందుకు రుణాలు కావాలన్నా ఈ పథకం కింద అందిస్తామని మోదీ తెలిపారు.

పీఎం కేర్స్‌ నిధులతో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగామని, ఎన్నో కుటుంబాల భవిష్యత్‌కు భరోసా కల్పించగలిగామని అన్నారు. ఖేలో ఇండియా, ఫిట్‌ ఇండియా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిల్లలకు సూచించారు. మందులు, టీకాలు సరఫరా చేసి ప్రపంచ దేశాలకు మనం పరిష్కర్తలా మారామని మోదీ పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో మన పరపతి పెరిగిందని అన్నారు.
 
అలాగే ఆయుష్మాన్‌ కార్డు ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని, మానసికంగా దృఢంగా ఉండేందుకు సంవాద్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తారని చెప్పారు. 2014కు ముందులా దేశంలో అవినీతి, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరగడం లేదని, ఉగ్రవాద కార్యకలాపాలూ లేవని మోదీ నొక్కి వక్కాణించారు.

  • Loading...

More Telugu News