AP Cabinet: అరకు ఎంపీ కారును వెనక నుంచి ఢీకొట్టిన వైసీపీ నేత కారు... తప్పిన ప్రమాదం
- నంద్యాల జిల్లా పరిధిలో ఘటన
- వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద సడెన్‌గా ఆగిన ఎంపీ మాధవి కారు
- సకాలంలో గుర్తించక ఆమె కారును ఢీకొట్టిన వెనుక ఉన్న కారు
- ఏ ఒక్కరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న మంత్రులు
ఏపీ కేబినెట్‌లోని బడుగులు, బలహీన వర్గాలకు చెందిన మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం ఓ పెను ప్రమాదమే తప్పింది. యాత్రకు హాజరైన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కారును వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొట్టుకున్న రెండు కార్లు స్వల్పంగా దెబ్బ తినగా...ఎంపీకి గానీ, ఆమె కారును ఢీకొట్టిన కారులోని వైసీపీ ప్రజా ప్రతినిధికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీకాకుళం నుంచి మొదలైన ఈ యాత్ర ఆదివారం నంద్యాల, కర్నూలు జిల్లాలను దాటుకుని అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డోన్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద యాత్రలోని వాహనాలు జాతీయ రహదారిపై వేగంగా సాగిపోతున్న వేళ... ఉన్నపళంగా ఎంపీ మాధవి కారు ఆగింది. అయితే ఆమె వెనుకాలే వస్తున్న కారు డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించేలోగానే ఆ కారు మాధవి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కూడా కాకపోవడంతో యాత్రలో కీలక భూమిక పోషిస్తున్న మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు.