YSRCP: టీడీపీ మహానాడుపై వైసీపీ మంత్రుల ఫైర్

YCP ministers fires on TDP Mahanadu

  • సామాజిక న్యాయభేరి యాత్ర చేపట్టిన వైసీపీ
  • నరసరావుపేటలో భారీ బహిరంగ సభ
  • టీడీపీ మహానాడు ఏడుపునాడు అంటూ అంబటి వ్యాఖ్యలు
  • అచ్చెన్నకు సిగ్గుండాలన్న కారుమూరి

వైసీపీ సర్కారు చేపడుతున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పల్నాడు జిల్లా చేరుకుంది. ఈ సందర్భంగా నరసరావుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న వైసీపీ మంత్రులు టీడీపీ మహానాడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అది మహానాడు కాదని ఏడుపునాడు అని మంత్రి అంబటి రాంబాబు అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు టీడీపీ మహానాడు వ్యతిరేకం అని విమర్శించారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా బాకా ఊదుతోందని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. 2024లో గెలిచేది తామేనని అంబటి ఉద్ఘాటించారు. 

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, మహానాడు వేదికపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొమ్మ కూడా లేదని, అచ్చెన్నాయుడికి సిగ్గుండాలని అన్నారు. బీసీలపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టే తెలుస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం పేరిట యాత్ర చేసే హక్కు తమకే ఉందని స్పష్టం చేశారు. 

మరోమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందిస్తూ... ప్రతిచోట వైసీపీకి ప్రజలు నీరాజనాలు పడుతుంటే చంద్రబాబుకు భయం కలుగుతోందని, అందువల్లే అబద్ధాల ఏడుపు ఏడుస్తున్నాడని వ్యాఖ్యానించారు. వైసీపీ సామాజిక న్యాయభేరితో చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయిందని అన్నారు. కాగా ఈ సభలో మంత్రులు జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

YSRCP
Samajika Nyaya Bheri
TDP Mahanadu
Andhra Pradesh
  • Loading...

More Telugu News