Jos Buttler: అజేయ సెంచరీతో చెలరేగిన బట్లర్.. ఫైనల్‌కు రాజస్థాన్

Buttler ton powers RR to IPL final

  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన బెంగళూరు
  • ఈసారి కూడా నెరవేరని కప్పు కల
  • ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా జోస్ బట్లర్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గత రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన బెంగళూరు ఈసారి కూడా ట్రోఫీ కల నెరవేర్చుకోకుండానే ఇంటి ముఖం పట్టింది. రజత్ పటీదార్ మరోమారు ఆపద్బాంధవుడిగా మారడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. రాజస్థాన్ ఎదుట 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఆర్ఆర్ ఓపెనర్ జోస్ బట్లర్ శతకబాదుడుతో ఈ లక్ష్యం చిన్నదైపోయింది. మొత్తం 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 10 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం (106, నాటౌట్) నమోదు చేశాడు. ఈ సీజన్‌లో బట్లర్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా, ఐపీఎల్‌లో ఐదోది. యశస్వి జైస్వాల్ 21, కెప్టెన్ సంజు శాంసన్ 23 పరుగులు చేయడంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి దర్జాగా ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు పరుగులు రాబట్టడంలో దారుణంగా విఫలమైంది. ఫైనల్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ (7), డుప్లెసిస్ (25), మ్యాక్స్‌వెల్ (24) బ్యాట్లెత్తేశారు. క్రీజులో నిలదొక్కుకోలేక వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేరారు. ఒక్క రజత్ పటీదార్ మాత్రం మరోమారు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన పటీదార్.. ఈ మ్యాచ్‌లో 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేయడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. 

షాబాజ్ అహ్మద్ (12) మినహా మిగతా ఎవరూ సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు. ఆదుకుంటాడనుకున్న దినేశ్ కార్తీక్ (6) కూడా వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరాడు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్‌లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. అజేయ సెంచరీతో జట్టును ఫైనల్స్‌కు చేర్చిన రాజస్థాన్ ఓపెనర్ బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బెంగళూరును చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్ రేపు (ఆదివారం) గుజరాత్ టైటాన్స్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది.

Jos Buttler
IPL 2022
Rajasthan Royals
Royal Challengers Bangalore
  • Loading...

More Telugu News