IAS couple: పెంపుడు కుక్క కోసం స్టేడియంను ఖాళీ చేయించిన ఐఏఎస్ జంటపై బదిలీ వేటు
- సంజీవ్ ఖిర్వార్ లడఖ్ కు బదిలీ
- రింకూ దుగ్గాను అరుణాచల్ కు ట్రాన్స్ ఫర్ చేసిన కేంద్ర హోంశాఖ
- పెంపుడు కుక్క ఎక్కడికి వెళ్లాలంటూ నెటిజన్ల ప్రశ్నలు
ఢిల్లీలో పెంపుడు శునకంతో కలసి వాకింగ్ చేసుకునేందుకు స్టేడియంను ఖాళీ చేయించిన ఐఏఎస్ జంటపై కేంద్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంకు ఇటీవల ఒక రోజు సాయంత్రం ఢిల్లీ రెవెన్యూ శాఖ సెక్రటరీ సంజీవ్ ఖిర్వార్, ఆయన భార్య రింకూ దుగ్గా వాకింగ్ కోసం వెళ్లారు. వీరి రాకతో స్టేడియంను ముందే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అక్కడున్న అథ్లెట్లు, కోచ్ లను సిబ్బంది కోరారు. సాయంత్రం 7 గంటల్లోపు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ తర్వాత ఖాళీ స్టేడియంలో ఐఏఎస్ దంపతులు పెంపుడు కుక్కతో కలసి నడుస్తున్న ఫొటో ఒకటి నెట్టింట సంచలనం సృష్టించింది.
దీనిపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నుంచి నివేదిక తెప్పించుకుంది. అనంతరం సంజీవ్ ఖిర్వార్ ను లడఖ్ కు , ఆయన భార్య రింకూ దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్ కు బదిలీ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇద్దరూ 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారులే. అయితే, రోజువారీ అధికారికంగా సాయంత్రం 7 గంటలకు స్టేడియంను మూసివేస్తుంటామని త్యాగరాజ స్టేడియం అడ్మినిస్ట్రేటర్ అజిత్ చౌదరి స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని స్టేడియంలను రాత్రి 10 గంటల వరకు అథ్లెట్లు, శిక్షకుల కోసం తెరిచే ఉంచాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.
అయితే, దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఐఏఎస్ దంపతులను తలో దిక్కుకు పంపిస్తే వారు పెంచుకునే కుక్క పరిస్థితి ఏం కాను? అని ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎవరు వాకింగ్ కు తీసుకెళతారు? కుక్క లడఖ్ వెళ్లాలా? లేక అరుణాచల్ వెళ్లాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.