Madhya Pradesh: ఈ రైలు యమా ఫాస్ట్ గురూ.. ముందుగానే వచ్చేసిన రైలును చూసి డ్యాన్స్ చేసిన ప్రయాణికులు!
- నిర్ణీత సమయానికి 20 నిమిషాల ముందుగానే వచ్చిన రైలు
- మధ్యప్రదేశ్‌లోని రాట్లాం స్టేషన్‌లో ఘటన
- ఆనందం పట్టలేక సంప్రదాయ గర్భా నృత్యాలు చేసిన ప్రయాణికులు
- వీడియోను షేర్ చేసిన రైల్వే మంత్రి
‘నీవెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు’ అంటారు ఆరుద్ర. భారత రైల్వే మందగమనంపై అదొక సెటైర్. సమయానికి వస్తే అది రైలు ఎలా అవుతుందన్న జోకులు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇప్పుడిలాంటి జోకులకు కాలం చెల్లబోతోంది. నిర్ణీత సమయానికి ముందుగానే వచ్చి ప్లాట్‌ఫాం మీద వాలిపోయిన ఓ రైలు ప్రయాణికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ముందే వచ్చిన రైలును చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన ప్రయాణికులు ప్లాట్‌ఫాం మీదకు చేరుకుని నృత్యాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని రాట్లాం రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగిందీ ఘటన.
బాంద్రా-హరిద్వార్ రైలు బుధవారం రాత్రి 10.35 గంటలకు రాట్లాం చేరుకోవాల్సి ఉంది. అక్కడా ట్రైన్ పది నిమిషాల పాటు ఆగుతుంది. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ రైలు 20 నిమిషాల ముందుగానే రాట్లాం స్టేషన్‌కు చేరుకుంది. ఫలితంగా 30 నిమిషాల సమయం దొరకడంతో ప్రయాణికులు అందరూ కిందికి దిగి తమ ఆనందాన్ని డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేశారు. సంప్రదాయ గర్భా నృత్యంతో అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘హ్యాపీ జర్నీ’ అని రాసుకొచ్చారు.