Kapil Sibal: కాంగ్రెస్ కు కపిల్ సిబల్ గుడ్ బై.. ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు

Kapil Sibal dumps Congress files Rajya Sabha nomination with Samajwadi Partys backing

  • ఎస్పీ మద్దతుతో నామినేషన్ దాఖలు
  • 30 ఏళ్ల తర్వాత స్వతంత్రంగా పని చేయాల్సిన అవసరం వచ్చినట్టు ప్రకటన
  • మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్న సిబల్

కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి కపిల్ సిబల్ రాజీనామా సమర్పించారు. ఎవరూ ఊహించని చర్యతో షాకిచ్చారు. సమాజ్ వాదీ పార్టీ (ఎప్పీ) మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సిబల్ వెంట ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో పాటు ఆ పార్టీ నేతలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్కరించాలని డిమాండ్ చేస్తూ, పార్టీకి దూరంగా ఉంటున్న జీ23 (గ్రూపు 23) నేతల్లో కపిల్ సిబల్ కూడా ఒకరు. 

‘‘స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నాను. దయచేసి సహకారం అందించండి.. అంటూ అఖిలేశ్ జీని కోరాను. 30 ఏళ్ల తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేను ఇప్పుడు ఏమీ మాట్లాడను. విపక్షాల్లో చాలా వాటితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తో అనుబంధం ఉందని నా భార్య చెప్పింది’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. 

‘‘నేడు కపిల్ సిబల్ నామినేషన్ వేశారు. ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు వెళుతున్నారు. మరో ఇద్దరు కూడా ఎస్పీ నుంచి రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. కపిల్ సిబల్ సీనియర్ న్యాయవాది. ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటులో చాలా చక్కగా వినిపిస్తారు. ఆయన సొంత అభిప్రాయాలతో పాటు, ఎస్పీ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తారని భావిస్తున్నాను’’ అంటూ అఖిలేశ్ యాదవ్ అన్నారు.

‘‘మేము కూటమి ఏర్పాటు చేసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయాలి. బీజేపీని వ్యతిరేకించే వాతావరణం ఏర్పాటు చేయాలి. ఆ దిశగా నేను పనిచేస్తాను’’ అని సిబల్ ప్రకటించారు. యూపీ నుంచి 11 రాజ్యసభ స్థానాలకు ఈ విడత ఎన్నికలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News