Bindu Madhavi: బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి పెళ్లిపై ఆమె తండ్రి ఏమన్నారంటే..!

Bindu Madhavi fathers comments on her marriage

  • చదువుకుంటున్నప్పుడే బిందుకు పెళ్లి సంబంధాలు వచ్చాయన్న తండ్రి
  • ఐపీఎస్, ఐఆర్ఎస్ సంబంధాలు కూడా వచ్చాయని వెల్లడి
  • ఒత్తిడి తెచ్చినా పెళ్లికి ఒప్పుకోలేదని వివరణ 

తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా సినీ నటి బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే. చివరి వరకు గట్టి పోటీని ఎదుర్కొన్న ఆమె.. చివరకు ట్రోఫీతో పాటు రూ. 40 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. తద్వారా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి మహిళగా అవతరించింది. మరోవైపు ప్రస్తుతం ఆమె పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఆమె తండ్రి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

బిందు మాధవిని ఇంజినీరింగ్ చదివేటప్పుడే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశామని ఆయన తెలిపారు. అప్పట్లో చాలా మంచి సంబంధాలు వచ్చాయని... ఐపీఎస్, ఐఆర్ఎస్, డాక్టర్, అమెరికా ఇంజినీరింగ్ సంబంధాలు వచ్చాయని... మంచి సంబంధాలు రావడంతో ఒక తండ్రిగా పెళ్లి చేసుకోవాలంటూ బిందుపై ఒత్తిడి తెచ్చానని అన్నారు. అయితే పెళ్లికి ఆమె ఒప్పుకోలేదని... దీంతో, తాను కూడా బాధపడ్డానని చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సంబంధాలను చూశానని... అప్పుడు కూడా ఒప్పుకోలేదని తెలిపారు. 

తాను చిన్న పిల్లను కాదుకదా... తన మంచి చెడ్డలను తానే చూసుకుంటానని బిందు మాధవి చెప్పిందని ఆయన అన్నారు. తాను చెప్పినప్పుడు పెళ్లి చేయాలని అడిగిందని చెప్పారు. అప్పటి నుంచి పెళ్లి విషయాన్ని బిందుకే వదిలేశానని తెలిపారు. ఇప్పుడు కాలం చాలా మారిపోయిందని... పిల్లల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులు నడుచుకోవాలని చెప్పారు.

More Telugu News