KCR: అర్థాంతరంగా ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. చర్చలు, భేటీలు వాయిదా
- ఈ నెల 20న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్
- నేడు, రేపు జరగాల్సిన చర్చలు, భేటీలు వాయిదా
- తిరిగి ఈ నెల 25న బెంగళూరుకు సీఎం
- దేవెగౌడ, కుమారస్వామితో భేటీ
- చర్చనీయాంశమైన కేసీఆర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. గత రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 20న కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. 21న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. 22న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి చండీగఢ్ చేరుకున్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. అక్కడి వరకు పర్యటన సజావుగానే సాగింది.
అయితే, ఏమైందో ఏమో కానీ.. నేడు, రేపు పలువురు ప్రముఖులతో జరగాల్సిన చర్చలు, భేటీలను రద్దు చేసుకుని సీఎం అర్థాంతరంగా హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, ఈ నెల 25న కేసీఆర్ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ అవుతారు. అలాగే, 27న మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధి వెళ్లి అన్నాహజారేతో భేటీ అవుతారు. అదే రోజు షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.