CM Jagan: దావోస్ లో ఏపీ పెవిలియన్ కు వచ్చిన టెక్ మహీంద్రా చైర్మన్ గుర్నానీ.. సీఎం జగన్ తో సమావేశం
- దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
- వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
- ఏపీ పెవిలియన్ కు తరలివచ్చిన ప్రముఖులు
- పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం జగన్ కృషి
ఏపీకి పారిశ్రామిక పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ లో సీఎం జగన్ బృందం కృషి చేస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు రెండో రోజు కూడా సీఎం జగన్ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. తాజాగా, టెక్ మహీంద్రా చైర్మన్, సీఈవో సీపీ గుర్నానీ దావోస్ లోని ఏపీ పెవిలియన్ కు విచ్చేశారు. ఆయన సీఎం జగన్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సీఎం జగన్ ఆయనకు ఏపీలోని అనుకూలతలపై వివరించారు. ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలపైనా, రాష్ట్రంలో మానవ వనరుల లభ్యతపైనా ఈ సమావేశంలో చర్చించారు.
అటు, ప్రఖ్యాత డసాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జెలెన్ కూడా సీఎం జగన్ ను కలిశారు. అంతేకాదు, స్విట్జర్లాండ్ ఎంపీ నిక్లాస్ శామ్యూల్ గుగ్గర్ తన బృందంతో కలిసి ఏపీ పెవిలియన్ కు విచ్చేశారు. స్విస్ ప్రతినిధుల బృందానికి సాదరంగా స్వాగతం పలికిన సీఎం జగన్ ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించారు.