clay pots: మట్టి కుండలు, పాత్రలతో అంతా మంచే అంటున్న నిపుణులు!
- కుండలోని నీటితో వడదెబ్బ రిస్క్ ఉండదంటున్న వైద్యులు
- జీర్ణ, జీవక్రియలకు మేలని వెల్లడి
- మట్టి పాత్రల్లో వండుకోవడం వల్ల కూడా పలు లాభాలుంటాయని వ్యాఖ్య
- మంచి రుచితో పాటు పోషకాలకు నష్టం ఏర్పడదని వివరణ
మట్టి నుంచే వచ్చాం.. మట్టితోనే సహజీవనం. తిరిగి మట్టిలోనే కలసిపోతాం. ఇదంతా ప్రకృతి ఏర్పాటు. మరి మట్టి పాత్రలు, మట్టి కుండలను ఎందుకు దూరం చేసుకుంటున్నాం..? ఇప్పటికీ పల్లెల్లో మట్టి కుండలు కనిపిస్తుంటాయి. మట్టి పాత్రల్లో వండుకుని తినే వారు కూడా ఉన్నారు. కొందరు ఎప్పుడూ మట్టి కుండల్లోని నీటినే తాగుతుంటారు. కానీ, పట్టణ వాసులు వీటికి దూరమయ్యారు. ఆటోమేటిక్ ఎయిర్ ప్యూరిఫయర్లు, ఫ్రీజర్ బాటిళ్లలోని నీటితో అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మట్టి కుండలో నీరు తాజాగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. మట్టి కుండలోని నీరు తాగడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. మట్టి కుండలో నిల్వ ఉన్న నీరును తాగినప్పుడు జీవక్రియలకు మంచి శక్తి లభిస్తుందని వైద్యులు అంటున్నారు. ఫ్రిజ్ లో నీటిని కూల్ చేసుకోవడం అసహజమైన విధానం. దీనికి బదులు మట్టికుండలో పోసి నిల్వ ఉంచితే అవే చల్లగా అయిపోతాయి. మట్టి కుండలో నీటిని తాగడం వల్ల వడదెబ్బ రిస్క్ కూడా తగ్గుతుంది. పైగా కుండల్లో ఎటువంటి హానికారక రసాయనాలు ఉండవు. కడుపులో మంట, ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక మట్టి పాత్రలను వంటకు వినియోగించుకోవడం వల్ల కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయి. మట్టి కుండలు ఆల్కలైన్ స్వభావంతో ఉంటాయి. కనుక వండే సమయంలో ఆహారంలోని యాసిడ్ మట్టి పాత్రలోని ఆల్కలైన్ తో చర్యకు గురవుతుంది. ఇది పీహెచ్ స్థాయులను తటస్ఠీకరిస్తుంది. మంచి వాసన కూడా తోడవుతుంది. మట్టి పాత్రల్లో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. మంచి రుచి కూడా వస్తుంది.