Himachal Pradesh: తరగతి గదిలో విద్యార్థి చెంప చెళ్లుమనిపించిన హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్.. వీడియో ఇదిగో!
- ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన హన్స్‌రాజ్
- నవ్వుతున్న విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే
- ప్రేమతో చెంప నిమిరారన్న విద్యార్థి తండ్రి
- ఆయనతో అలా చెప్పిస్తూ వీడియోకు దొరికిన మరో వ్యక్తి
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ హన్స్‌రాజ్ ఓ విద్యార్థి చెంప చెళ్లుమనిపించడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం ఆయన రైలాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూలును సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన ఓ విద్యార్థి చెంపపై చేయి చేసుకున్నారు. వీడియో బయటకు రావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. హన్స్‌రాజ్ ఓ విద్యార్థితో మాట్లాడుతూ.. అనారోగ్యంగా ఉందా? అని అడిగారు. అదే సమయంలో ఓ విద్యార్థి నవ్వడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ‘క్యోం హస్ రహా హై భాయ్’ (ఎందుకు నవ్వుతున్నావు సోదరా?) అని ప్రశ్నిస్తూ ఆ విద్యార్థి వద్దకెళ్లి చెంప చెళ్లుమనిపించారు. ఆ శబ్దం వీడియో క్లిప్‌లో స్పష్టంగా వినిపిస్తోంది.
విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఎమ్మెల్యే తన కుమారుడిని కొట్టలేదని, ప్రేమగా అతడి బుగ్గలను తాకారని చెప్పడం గమనార్హం. ఇందుకు తాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ బాలుడి తండ్రి ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే, పక్కనున్న ఓ వ్యక్తి అతడితో అలా చెప్పిస్తున్నట్టు వీడియోలో రికార్డు కావడం గమనార్హం. మరోవైపు, బాలుడిపై చేయిచేసుకున్న హన్స్‌రాజ్‌పై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ డిమాండ్ చేశారు. అంతేకాదు, ఆయన వెంటనే మెంటల్ ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలంటూ తీవ్ర విమర్శలు చేశారు.