Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ మృతిపై ఏపీ డీజీపీ స్పందన ఇదే
- సుబ్రహ్మణ్యం మృతిపై కేసు నమోదు చేశామన్న డీజీపీ
- వైద్య నివేదికలు రాగానే దర్యాప్తు మొదలెడతామని వెల్లడి
- వీలయినంత త్వరగా దర్యాప్తు ముగిస్తామని వ్యాఖ్య
ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం స్పందించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని చెప్పిన ఆయన.. వైద్య నివేదికలు అందాక పూర్తి స్థాయి దర్యాప్తును మొదలుపెడతామని చెప్పారు కేసు దర్యాప్తును వీలయినంత త్వరగా ముగిస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుపై డీజీపీ మాట్లాడారు.
ఇదిలావుంచితే, విజయవాడ అత్యాచారం కేసులో పోలీసులు సరిగా స్పందించలేదని, అందుకే బాధ్యులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని డీజీపీ వెల్లడించారు. ఇక మాజీ మంత్రి నారాయణ కేసులో సహకరించని కారణంగానే ఏపీపీ సుజాతపై సస్పెన్షన్ వేటు పడిందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా సంస్థల సహకారంతోనే ఫేక్ న్యూస్‌ను నివారించడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.