tea: టీలో బెల్లం వేసుకుని తాగొచ్చా..? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
- టీ, బెల్లం మంచి కాంబినేషన్ కాదంటున్న ఆయుర్వేద వైద్యులు
- రెండింటి గుణాలు వేర్వేరు
- దీనివల్ల జీర్ణక్రియపై ప్రభావం
- టీలో రాక్ షుగర్ మంచిదని సూచన
చక్కెర ఆరోగ్యానికి హాని చేస్తుందన్న అవగాహన పెరుగుతోంది. దీంతో కొందరు చక్కెర మానేసి బెల్లానికి (జాగరీ) ప్రాధాన్యం ఇస్తున్నారు. టీ లో బెల్లం, తేనె కలుపుకుని తాగుతున్నారు. కానీ, ఆయుర్వేదం మాత్రం టీ, బెల్లం కలయిక సరైనది కాదని అంటోంది.
‘‘ఆయుర్వేదం ప్రకారం.. విరుద్ధ ఆహారం లేదా అసహజమైన పదార్థాల కలయికతో ఆమ గుణానికి దారితీస్తుంది. అంటే జీర్ణంపై ప్రభావం చూపించే హానికారకాలు విడుదల అవుతాయి. ప్రతీ ఆహారానికి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ఇవి రుచి, శక్తి, జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి’’ అని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రేఖ రాధామణి తెలిపారు.
బెల్లం అన్నది వేడిని కలిగిస్తుంది. పాలు చల్లదనాన్ని ఇస్తాయి. ఈ రెండింటిని కలపడం అననుకూలమైనదిగా ఆమె పేర్కొన్నారు. మరి టీలో సహజ తీపిని తీసుకురావడం ఎలా..? మిశ్రి లేదా రాక్ షుగర్ మంచిదని.. పాలు మాదిరే చల్లటి గుణంతో ఇది ఉండడం అనుకూలమని రాధామణి వెల్లడించారు.
ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యంపై ప్రభావం చూపించే అసహజ కలయికల్లో.. అరటి పండు, పాలు.. పాలు, చేపలు.. పెరుగు, వెన్న, తేనె, నెయ్యి.. ఇలా పొందికలేని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వాపు, చర్మ సమస్యలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.