Heroin: లక్షద్వీప్ తీరంలో డ్రగ్స్ కలకలం.. రూ. 1,526 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
- బోట్లలో తరలిస్తున్న హెరాయిన్‌ను పట్టుకున్న డీఆర్ఐ, ఐసీజీ
- ఆపరేషన్ ఖొజ్బీన్’ పేరుతో దాడులు
- కిలో చొప్పున ప్యాకెట్లుగా చేసి తరలిస్తున్న 218 కేజీల హెరాయిన్ పట్టివేత
- ఇంత భారీ ఎత్తున పట్టుబడడం గత రెండు నెలల్లో నాలుగోసారి
దేశంలో ఎక్కడో ఓ చోట ప్రతి రోజు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడడం పరిపాటిగా మారింది. తాజాగా లక్షద్వీప్ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. పడవల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 218 కేజీల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) అధికారులు పట్టుకున్నారు. ‘ఆపరేషన్ ఖొజ్బీన్’ పేరుతో అగట్టి తీరంలో డీఆర్ఐ, ఐసీజీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్మగ్లర్ల ఆట కట్టించారు. హెరాయిన్‌ను కిలో చొప్పున ప్యాకెట్లుగా చేసి తరలిస్తున్న రెండు బోట్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన హెరాయిన్ విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు 1,526 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పలువురు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, మాదక ద్రవ్యాలు తరలిస్తున్న బోట్లను కొచ్చికి తరలించారు. కాగా, దేశంలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం గత రెండు నెలల వ్యవధిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఏప్రిల్‌లో రూ. 26 వేల కోట్ల విలువ చేసే 3,800 కిలోలకు పైగా హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.